కొత్త గాజా
ఇంక సమయం లేదు
అమ్మ పొట్టలోనే ఇంకొద్దిసేపు ఉందామని అనుకోవద్దు
నా చిట్టితండ్రీ, తొందరగా వచ్చెయ్
నీకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాననే కాదు
యుద్ధం ఉదృతమవుతున్నది
ఆలస్యంచేస్తే
ఈ దేశాన్ని నువ్వెట్లా చూడాలని ఆశపడ్డానో
అలా చూడలేవోమోనని నాకు భయంగా ఉంది.
…
నీ దేశం మట్టి కాదు
రానున్న సంకటాన్ని ముందే ఊహించి చచ్చిపోయిన సమద్రమూ కాదు:
నీ దేశం అంటే నీ జనం.
వచ్చి నీ దేశాన్ని తెలుసుకో
బాంబులు ఛిద్రం చేసిన
నీ దేహం ఆనవాళ్లను
నేను పోగుచేసుకోవలసి రాకముందే
వెళ్లిపోయిన వాళ్లు అందమైన వాళ్లనీ,
ఏ మాయమర్మం తెలియని వాళ్లనీ
తెలుసుకునేందుకు వచ్చెయ్.
నీ లాంటి చిన్న పిల్లలు
చనిపోయిన వాళ్లను ఉంచే మంచు గడ్డల నుంచి
పారిపోయేందుకు పురికొల్పుతారు వాళ్లు
దాడి తరువాత దాడి మిగిల్చిన అనాధ పిల్లలు
ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరికొకరు
జీవితాశలను అందించుకుంటారు
…
నువ్వు ఆలస్యంగా వస్తే
నేను చెప్పేది నమ్మవేమో,
ఇది జనంలేని దేశమని
మన మెప్పుడూ ఇక్కడ ఉండింది లేదని
నమ్ముతావేమో.
రెండుసార్లు దేశబహిష్కృతులమయినా
డెబ్బై-అయిదేళ్లపాటు
విధి మీద మేం తిరగబడ్డాం
విధీ వికటించింది, ఆశలు అడుగంటాయి
…
జీవితం ఎంతో భారమైపోయింది
నువ్వు మొయ్యలేనంత భారమైంది.
నాకు తెలుసు.
గుంటల వెనక నక్కి వేటాడడానికి పొంచివున్న సివంగులంటే
భయపడిన బలహీనమైన జింక తల్లిని నన్ను క్షమించు.
తొందరగా వచ్చి, వెంటనే పారిపో
ఎంత దూరం వీలయితే అంత దూరం
నీ గురించిన దిగులుతో నేను కుంగి కృశించిపోకుండా.
…
నిన్న రాత్రి, నిస్పృహతో అలసిపోయాను
నిశ్సబ్దంగా ఉండమని ఆజ్ఞాపించాను.
దీనంతటితో తనకేం సంబంధం?
నా చిన్నారి, చిరుగాలి వంటి చిన్ని పాపా,
ఈ తుపానుతో తనకేం సంబంధం?
కానీ ఈరోజు నేనొక దుర్వార్తను మోసుకొని రావలసివచ్చింది:
గాజాలో బాప్టిస్టు హాస్పిటల్ మీద బాంబులు వేశారు.
అక్కడ బలయిన 500 మందిలో ఒకడైన పిల్లవాడు,
తన సోదరుడిని పిలిచాడు,
పేలిపోయిన తలలో కళ్లు సగం తెరుచుకున “అన్నా!
నేను కనిపిస్తున్నానా?’
లేదు, తన సోదరుడు తననిక చూడలేడు
తనను చూడడానికి నిరాకరించి
రెండుగంటలసేపు పట్టించుకోకుండా ఉండి,
తననూ, తన సోదరుడినీ మరచిపోయేందుకు నిద్రపోయిన వెర్రిలోకంలాగానే,
మరచిపోతాడు తన సోదరుడిని..
…
ఇప్పుడిక నీకేం చెప్పేది?
దుర్ఘటనా, విపత్తూ అక్కా చెల్లెళ్లు
ఇద్దరూ ఘోరమైన ఆకలితో క్రోధంతో నామీద దాడి చేస్తారు.
శవమనే పదానికున్న అన్ని సమానార్థకాల్ని
నా పెదాలు వణికిపోతూ ఉచ్ఛరించేదాకా
వాళ్లు నా మీద దాడిచేస్తారు.
యుద్ధకాలంలో ఏ కవిమీదా ఆశలు పెట్టుకోవద్దు
అతడు తాబేలంత నెమ్మది
కుందేలులా పరిగెత్తే ఈ నరమేధంతో
పందెం వేసి పరిగెట్టాలని విఫల యత్నం చేస్తాడు.
తాబేలు పాకుతూ పోతుంది
కుందేలేమో ఒక నేరంనుంచి మరోనేరానికి గెంతులేసుకుంటూ పోతుంది.
వాళ్లు గురి చూసి నేలమట్టం చేసిన మసీదు శిథిలాల్లోంచి వచ్చిన
దేవుడు చూస్తుండగానే ఇప్పుడు ఆర్థడాక్ష్ చర్చి మీద కూడా బాంబు పడింది
రక్షకుడి పవిత్ర స్థలంలో ఎక్కడ రక్షకుడు?
స్వర్గంలో ఉన్న తండ్రి, నిజానికి ఒక బాంబరు విమానం
ఎవరూ తోడులేని తను ఒక్కడే,
మా మీద బాంబులు వెయ్యడానికి వచ్చినవాడు తప్ప.
కానీ వాడి గురి మా లొంగుబాటుతనం మీద పడింది .
నా చిట్టితండ్రీ, నువ్విప్పుడు శిలువ మీద ఉన్నావు
ఇక అక్కడ ప్రవక్తలందరికీ చోటు ఉంటుంది.
దేవుడికి అంతా తెలుసు
నీకు, నీలాంటి గర్భంలోని అమాయక శిశువులకే
ఇంకా తెలియాల్సి ఉంది.
Telugu translation of Marwan Makhoul’s poem New Gaza by Mamatha Kodidela (మమత కొడిదెల)